పంటకు విలువ జోడించి (వాల్యూ అడిషన్) విక్రయిస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మొరింగ సూపర్ ఫుడ్. మొరింగ అంటే మునగాకు. సాధారణంగా మునగను కాయల కోసం పెంచుతారు. అయితే వాటి ఆకులను ఎండబెట్టి పొడి చేసి అమ్మడం వల్ల ఎక ఎకరాకు రూ.12.50 లక్షల ఆదాయం అందుకోవచ్చునని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మునగాకు పోషకాహార లోపానికి మంచి మందు. అంతేకాకుండా మునగాకు పొడిలో ఎక్కువ ఔషద విలువలు ఉండటం వల్ల ఔషద తయారీ పరిశ్రమల్లో (ఫార్మా) దీనిని ముడి పదార్థంగా వాడుతున్నారు. అందువల్లే మునగాకు పొడికి మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. కేవలం ఆకులే కాకుండా మునగ బెరుడు, కాయలు, పువ్వులు, వేర్లు ఇలా మునగ మొక్కలోని ప్రతి భాగం ఔషద విలువ పరంగా ముఖ్యమైనదే. అందువల్ల ఇటీవల కాలంలో మునగ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటోంది.
మునగ లో ఉన్న ఔషద విలువలు ఇవి
మునగాకు పొడిలో విటమిన్ A, విటమిన్ C తో పాటు కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల చిన్నపిల్లలకు, వృద్ధులకు మునగాకు వల్ల ఎంతో ఉపయోగం. జలుబు, దగ్గుతో బాధపడేవారు మునగ కాయల రసం లేదా సూప్ తాగడం వల్ల త్వరగా ఉపశమనం పొందుతారు. ఆస్తమా తదితర శ్వాస సంబంధ వ్యాధులకు మునగాకు పొడి మంచి ఔషదంగా పనిచేస్తుంది. చిన్న చిన్నదెబ్బలకు, కీళ్ల బెణికిన చోట వేడి చేసిన మునగాకుల కట్ట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. ఇక నిమ్మరసంలో కొద్దిగా మునగాకు (Moringa) రసం కలిపి ముఖానికి పూసుకుంటే ముఖం చాలా కాంతి వంతంగా పనిచేస్తుంది. ఇలా మునగాకు ఔషదంగానే కాకుండా సౌదర్య సాధనంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
సేంద్రియ విధానంలో పెంచి, విలువను జోడిస్తే
సేంద్రియ విధానం మునగను పెంచి అంటే జీవామృతం మరియు గోకృపామృతం వంటిని వాడి మునగను పెంచి దానిని పొడి చేసి అమ్మితే ఈ కథనంలో మొదట్లో చెప్పినట్లు ఎకరాకు రూ.12.50 లక్షల కంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. అదే విధంగా పంటకు విలువను జోడించే (వాల్యు అడిషన్) విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మునగ పంటను ఎండబెట్టి, పొడి చేసే విధానం పై అవగాహన పెంచుకోవాలి. ఇందుకు అవసరమైన పరికరాలు, యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మునగ పండించే ప్రాంతంలో అంతర పంటలను పండించడం వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుంది. ఇక పంటకు విలువ జోడించడం వల్ల రైతే తన ఉత్పత్తులకు ధరను నిర్ణయించి మార్కెట్లో అమ్మడానికి వీలవుతుంది. దీంతో అతను అగ్రిపెన్యూర్‌గా మారి మంచి లభాలు అందుకోవచ్చు.