జంతువులు, పక్షుల పెంపకాన్ని వ్యాపార మార్గంగా భావించేవారికి కుందేళ్ల పెంపకం మంచి ఆదాయాన్ని అందించే వనరుగా చెప్పవచ్చు. ఈ కుందేళ్లను మాంసం కోసమే కాకుండా పెంపుడు జంతువులుగా కూడా భావిస్తూ కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో పెరుగుతోంది. అందువల్లే వీటి పెంపకం వల్ల అధిక ఆదాయం అందుకోవచ్చు. మరోవైపు కొన్ని జాతులకు చెందిన కుందేళ్లను వాటి బొచ్చు కోసం కూడా పెంచుతారు. ఇలా ఒకే జంతువు నుంచి విభిన్న మార్గాల్లో ఆదాయం అందుకోవచ్చు కాబట్టే కుందేళ్ల పెంపకం ఇటీవల కాలంలో మంచి లాభదాయక పరిశ్రమగా మారుతోంది. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటింటే వీటి సంతానోత్పత్తి సామర్థ్యం ఎక్కువ. అంటే అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పిల్లలను అందిస్తాయి. అందువల్ల ఈ అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఉత్పాదకత చేతికి అందుతుంది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం అందుకోవచ్చు.
పరిశోధన, సమాచార సేకరణ అవసరం
కుందేళ్ల పెంపకం చాలా లాభదాయకమైన వ్యాపారం అన్న విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదు. అయితే కుందేళ్లను పెంచడానికి ముందు కొంత పరిశోధన, సమాచార సేకరణ తప్పనిసరి. కొన్ని జాతుల కుందేళ్లను మాంసం కోసం పెంచితే మరికొన్నింటిని వాటి పై ఉన్న బొచ్చుకోసం పెంచుతారు. అదేవిధంగా కొన్ని రకాల కుందేళ్ల జాతులు ముద్దుగా ఉంటూ పెట్స్‌గా ఉపయోగపడుతాయి. ఉదాహరణకు న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియా మరియు ఫ్లెమిష్ జెయింట్ జాతులకు చెందిన కుందేళ్లను మాంసం కోసం పెంచుతారు. ఇక అంగోరా మరియు రెక్స్ వంటి జాతుల నుంచి బొచ్చు లేదా ఉన్నిని సేకరణతో పాటు పెట్స్ గా పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.
పెంచే ప్రాంతం శుభ్రత పై దృష్టి పెట్టాలి
కుందేళ్ల పెంపకం చేపట్టే సమయంలో వాటి పెంపకానికి ఎంచుకునే ప్రాంతం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. కుందేళ్లను పెంచే ప్రాంతం చాలా పరిశుభ్రంగా ఉండటమే కాకుండా చుట్టు పక్కల వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉండాలి. సూర్యరశ్మి బాగా తగలాలి. అంతేకాకుండా వెలుతురు, గాలి కూడా ఉండాలి. ఇందుకోసం కొన్ని కృత్రిమ పద్దతులను కూడా ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా కుందేళ్లు బాగా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల కుందేళ్లు తిరగడానికి అవసరమైన స్థలం ఉండేలా చూసుకోవాలి. దీంతో కుందేళ్ల సంఖ్యను అనుసరించి వాటి పెంపకానికి అవసరమైన స్థలం ఎంపిక జరగాలి. ఈమేరకు శాస్త్రీయ పద్దతుల్లో షెడ్ నిర్మించాలి. తర్వాత నీటి సరఫరా, ఆహారం విషయంలో చాలా జగ్రత్తగా ఉండాలి. కుందేళ్లకు ఇచ్చే నీరు చాలా స్వచ్ఛంగా ఉండాలి. అంతేకాకుండా వాటికి ఆహారంగా అందించే కూరగాయలు, పండ్లు తాజాగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అవి బాగా తిని ఆరోగ్యంగా పెరగడానికి వీలవుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న కుందేళ్లే మార్కెట్‌లో మంచి ధర పలుకుతాయి. తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది.
కుందేళ్లకు వచ్చే వ్యాధుల పై అవగాహన అవసరం
అటు పై ముఖ్యంగా గమనించాల్సింది కుందేళ్లకు సోకే వ్యాధులు, వాటి నివారణ. ఇందుకోసం కుందేళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణకు సంబంధించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం మేలు చేస్తుంది. తద్వారా కుందేళ్ల పెంపక కేంద్రంలోని కుందేళ్ల శరీరం పై ఏదేని అనుమానాస్పద గాయాలు లేదా వాటి ప్రవర్తనలో మార్పు కనిపించిన వెంటనే అప్రమత్తమై వెంటనే చికిత్స అందించడానికి వీలవుతుంది. కుందేళ్ల పెంపకంతో పాటు వాటి క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులు ఒక్కొక్క రాష్ట్రం లేదా ఒక రాష్ట్రంలోనే వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల కుందేళ్ల పెంపకానికి సంబంధించిన అనుమతులు, వాటి మాంసం క్రయవిక్రయాలకు సంబంధించి లైసెన్సింగ్ విషయమై స్థానిక ప్రభుత్వ శాఖల నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా సరైన ప్రణాళికతో కుందేళ్ల పెంపకాన్ని చేపడితే ప్రతి నెల రూ.3 లక్షలకు తక్కువ కాకుండా ఆదాయం అందుకోవచ్చు.